CAPF constable exam: కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్(CAPF) కానిస్టేబుల్ పరీక్షను హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర సాయుధ బలగాల్లో యువత ప్రాధాన్యతను పెంచడాని, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. CAPFలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) భాగంగా ఉంటాయి.
Read Also: Nitish Kumar: కేజ్రీవాల్ తగిన సమయంలో బదులిస్తారు.. సీబీఐ సమన్లపై బీహార్ సీఎం..
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఇది ఓ కీలక నిర్ణయం అని, సీఏపీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ను హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి ఆమోదం తెలిపామని ఆ శాఖ వెల్లడించింది. హిందీ, ఇంగ్లీష్ లతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి మరియు కొంకణి వంటి 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
CRPF సిబ్బంది రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పరీక్షను తమిళ భాషలో నిర్వహించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతూ లేఖ రాశారు. దీని తర్వాత ఈ ప్రకటన వచ్చింది. హిందీ, ఇంగ్లీష్ లో పరీక్ష రాయడం వల్ల ఇతర భాషల ఆశావహులు నష్టపోతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాజాగా కేంద్రం ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించడాన్ని స్టాలిన్ స్వాగతించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు.