NTV Telugu Site icon

DK Shivakumar: “సోనియా గాంధీ మాటిచ్చినట్లే”.. డీకే శివకుమార్ కన్నీరు..

Dk Shivakumar

Dk Shivakumar

DK Shivakumar: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం వైపు వెళ్తోంది. మెజారిటీ మార్కును దాటేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 138 స్థానాల్లో, బీజేపీ 63, జేడీఎస్ 20 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ విజయంపై కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్న సమయంలో.. సోనియా గాంధీ నన్ను జైలుకు వచ్చి అలా పరామర్శించడం మరిచిపోలేదని ఆయన భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టుకున్నారు. కర్ణాటకను ఆదుకుంటానని సోనియా గాంధీకి మాటిచ్చినట్లు ఆయన తెలిపారు.

Read Also: Karnataka Results: గ్రాండ్‌ విక్టరీ కొట్టిన కాంగ్రెస్‌.. సీఎం అయ్యేదెవరు..?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం అందిస్తానని సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంకాగాంధీకి, మల్లికార్జన ఖర్గేకి తాను హామీ ఇచ్చానని, సోనియాగాంధీ నన్ను జైలులో పరామర్శించడం మరిచిపోలేదని ఆయన విలేకరులతో అన్నారు. ముఖ్యమంత్రి పదవికి పోటీదారుగా ఉన్న డీకే శివకుమార్.. కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం అని, కాంగ్రెస్ కార్యాలయంలో మా తదుపరి కార్యచరణ ఉంటుందని వెల్లడించారు.

మూడేళ్లుగా సరిగా నిద్రపోలేదని, నేను నా అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని, ఆమె నాపై నమ్మకం ఉంచారని తెలిపారు. సిద్ధరామయ్యతో సహా నా రాష్ట్రంలోని నాయకులందరికీ డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది నా ఒక్కడి విజయం కాదని సమిష్టి విజయమని అభివర్ణించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయం అని, కర్ణాటక ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశం అని సిద్ధరామయ్య అన్నారు.

Show comments