Can Minors Marry Under Muslim Law? Kerala High Court Clarifies: ముస్లిం చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసుకోవచ్చా..? అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది కేరళ హైకోర్టు. అమ్మాయి, అబ్బాయి మైనర్ అయితే పెళ్లితో సంబంధం లేకుండా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) చట్టం నుంచి మినహాయించలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ బెచు కురియన్ థామన్ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం అనేది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేందుకు రూపొందించబడిన ప్రత్యేక చట్టం అని.. పిల్లలపై లైంగిక దోపిడిని నేరంగా పరిగణించబడుతుందని.. ఇందులో వివాహానికి మినహాయింపు లేదని స్పష్టం చేసింది కేరళ హైకోర్టు.
Read Also: TRS Vs BJP: ఎమ్మెల్యేలకు ఎరపై ఫ్లెక్సీలు.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్..
పోక్సో అనేది ప్రత్యేక చట్టం అని సామాజిక ఆలోచన విధానంలో రూపొందించబడి అమలులోకి వచ్చిందని.. లైంగిక దాడులన నుంచి పిల్లలను రక్షించాలనేదే ఈ చట్టం ఉద్దేశ్యం అని పేర్కొందడి. బాల్యవివాహాలను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారని కోర్టు పేర్కొంది. బాల్యవివాహం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఇది సమాజానికి శాపం అని, పోక్సో చట్టం వివాహం ముసుగులో పిల్లలను శారీరక సంబంధాల నుంచి రక్షణ ఇస్తుందని తెలిపింది. ఒక శాసనం అనేది ప్రజల సంకల్పం, వ్యక్తీకరణకు ప్రతిబింబం అని తెలిపింది. పోక్సో చట్టం సెక్షన్ 2(డీ)లో చైల్డ్ అనే పదాన్ని నిర్వచించింది. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిని పిల్లలుగా పరిగణిస్తుందని కోర్టు తెలిపింది.
వ్యక్తిగత చట్టాలు, ఆచార చట్టాలు రెండు చట్టాలే అని.. అయితే సెక్షన్ 42ఏ అటువంటి చట్టాలను కూడా అధిగమిస్తుందని కోర్టు పేర్కొంది. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వివాహం ముసుగులో పిల్లలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటికీ నేరంగానే పరిగణిస్తామని వెల్లడించింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 31 ఏళ్ల ముస్లిం వ్యక్తికి బెయిల్ పిటిషన్ విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ముస్లింలకు వర్తించే చట్టాల ప్రకారం 2021 మార్చిలో తానను సదరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు కోర్టులో వాదించాడు. అయితే కోర్టు మాత్రం నిందితుడి బెయిల్ పిటిషన్ కొట్టేసింది.