Maharashtra Bus Fire: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుంచి పూణే వెళ్తున్న స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదానికి గురై 25 మంది సజీవదహనమయ్యారు. మొత్తం 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై సింధ్ఖేడ్రాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికుల్లో 25 మంది మరణించారు. డ్రైవర్, క్లీనర్ తో సహా 8 మంది ప్రాణాలు దక్కించుకున్నారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కుడివైపు బోల్తాపడిందని.. దాని ఎంట్రెన్స్/ఎగ్జిట్ డోర్ పైకి ఉందని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. ఈ 8 మంది ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని చెబుతున్నారు. బస్సు టైర్ పగలడంతో బస్సు బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకున్నట్లు ప్రయాణికుల్లో బతికిన వ్యక్తి చెప్పారు. నా పక్కన కూర్చున్న వ్యక్తి, నేను వెనక కిటికీ పగలగొట్టి బస్సు నుంచి బయటపడ్డామని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన ఘటనాస్థలికి చేరుకున్నారని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తెలిపారు.
Read Also: ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మరో వ్యక్తి ఆయుష్ ఘట్గే ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడడం ఓ అద్భుతం అన్నారు. అతను నాగపూర్‌లోని పారిశ్రామిక శివారు ప్రాంతమైన బుటిబోరి వద్ద తాను బస్సు ఎక్కినట్లు తెలిపారు. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో నేను చివరి సీటులో మరియు నిద్రపోతున్నాను. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది నాపై పడటంతో నేను మేల్కొన్నాను. నేను వెంటనే లేచి బయటకు రావడానికి కిటికీ కోసం వెతకడం ప్రారంభించాను. నాతో పాటు ముగ్గురం ఒకరికి ఒకరం సాయం చేసుకుని బస్సు విండో అద్దాల్ని పగలగొట్టి బయటపడ్డాం’’ అని ఘట్గే అనే వ్యక్తి చెప్పారు.
ఉద్యోగాన్వేషన కోసం పూణే వెళ్తున్న ఐటీ ఇంజనీర్ అవనీ పోహ్నేకర్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆమె వార్దాలో బస్సు ఎక్కిందని బంధువులు తెలిపారు. నలుగురైదుగురు ప్రయాణికులు మాత్రమే అద్దాలు పగలగొట్టి బయటపడ్డారని స్థానికులు చెప్పారు. బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులకు హైవేపై వెళ్తున్న వాహనదారుల నుంచి సాయం అందలేదని చెప్పారు.
సాయం కోసం వెళ్లినప్పుడు అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని స్థానికులు చెప్పారు. ప్రయాణికులు మంటల్లో సజీవదహనం అవ్వడం చూశామని.. మంటలు తీవ్రంగా ఉండటంతో ఏం చేయలేకపోయామని, కన్నీరు పెట్టుకోవడం తప్పితే సాయం చేయలేకపోయాం అని స్థానిక నివాసి తెలిపారు. హైవే గుండా వెళ్లే వాహనాలను సహాయం కోసం నిలిపి ఉంటే, మరింత మంది ప్రాణాలను కాపాడేవారని ఆయన అన్నారు.