దసరా ముగిసింది. వెలుగుల పండుగ దీపావళి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. డీఏ వాయిదా మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) అదనపు విడుదలకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. డిఎ మరియు డిఆర్ పెంపు ప్రకటన దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి ఇది తీపి కబురే, అయితే, ఇక్కడో మెలిక పెట్టింది కేంద్రం.
డిఎ మరియు డిఆర్ రెండింటిపై ఖజానాపై భారీగానే భారం పడుతుంది. ఏడాదికి సుమారు, 9,488.70 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అంతకుముందు సెప్టెంబరులో, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నగదు చెల్లింపు మరియు గ్రాట్యుటీని అందుకుంటారని ఒక మెమోరాండం జారీ చేసింది.
దీనికి ముందు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే డిఎ మరియు డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) ను 17 శాతం నుండి 28 శాతానికి పెంచడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా, ప్రభుత్వం డిఎ మరియు డిఆర్ యొక్క అదనపు వాయిదాలను ఆపేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్రం DA పెంపు, మునుపటి కాలానికి DA రివ్యూ చేయక పోవడం వల్ల ఉద్యోగులు ఎటువంటి బకాయిలను పొందలేరని సూచించింది.