మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్త సమయానికి కరెంట్ పోవడంతో, పీటలపై ఉన్న వరుడు మారిపోయాడు. పెళ్ళి కూడా జరిగిపోయింది. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే.. అసలు విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిన్‌కి చెందిన రమేశ్‌కు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్న రమేశ్.. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తన కూతుళ్ళ పెళ్ళిని నిశ్చయించాడు.
ఎట్టకేలకు పెళ్ళి రోజు రానే వచ్చేసింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పెళ్ళిని చూసేందుకు బంధుమిత్రులంతా తరలివచ్చారు. అప్పటివరకూ అంతా సవ్యంగానే సాగింది. అయితే, సరిగ్గా పెళ్ళి ముహూర్తం సమయంలో కరెంట్ పోయింది. మళ్ళీ ఇలాంటి ముహూర్తం లేదని పండితుడు చెప్పడంతో, ఆ చీకట్లోనే పెళ్ళి చేసేశారు. అయితే, అంతకుముందు కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పీటలపై వరుడు మారిపోయాడు. తన సోదరి వరుడిని చెల్లి పెళ్ళి చేసుకుంది. ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ఉండడం వల్ల.. ఎవరూ వరుడు మారిపోయిన విషయాన్ని గమనించలేకపోయారు.
పెళ్ళి తంతు ముగిసిన తర్వాత అందరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడే, అసలు విషయం బయటపడింది. కరెంట్ పోయిన టైంలో తాను తన సోదరి వరుడిని పెళ్ళి చేసుకున్నానని చెల్లి గ్రహించి, పెద్దలందరినీ పిలిపించింది. అప్పుడు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, గొడవల వల్ల ఒరిగేమీ లేదని భావించి, మరుసటి రోజు మళ్ళీ వివాహ వేడుకను నిర్వహించారు. అలా ఈ వివాదం సద్దుమణిగింది.