Bride Elopes With Money Jewellery After 3 Days Of Marriage: ఉత్తరప్రదేశ్‌లో ఒక నవవధువు ఘరానా మోసానికి పాల్పడింది. పెళ్లికి ముందే పక్కా స్కెచ్ వేసుకున్న ఈ కిలేడీ.. పెళ్లయ్యాక అత్తింటి నుంచి డబ్బు, నగదు తీసుకొని పరారైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ జిల్లా బిల్హార్‌లోని జాదేపూర్ గ్రామానికి చెందిన అరవింద్, పెళ్లి చేసుకొని హ్యాపీగా దాంపత్య జీవితాన్ని గడపాలని అనుకున్నాడు. ఒక అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తక్తలీ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. తాము ఒక మంచి అమ్మాయిని వెతికి పట్టి, పెళ్లి పిక్స్ చేస్తామని నమ్మించారు. అందుకు తమకు రూ. 70 వేలు కావాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్‌ని అరవింద్ ఒప్పుకోవడంతో.. ఆ ఇద్దరు అతడ్ని బిహార్‌లోని గయాకు తీసుకెళ్లారు. అక్కడ రుచి అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు.
అరవింద్‌కి ఆ అమ్మాయి నచ్చడం, రుచి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ మరుసటి రోజే, అంటే అక్టోబర్ 1వ తేదీన గయాలోని ఒక గుడిలో వారి పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్నాక.. అరవింద్ తన భార్యని తీసుకొని స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి వరకూ అంత సజావుగానే సాగింది. కానీ.. అక్టోబర్ 4వ తేదీ అరవింద్ ఊహించని షాక్ తగిలింది. అతడు ఉదయం నిద్రలేచి చూసేసరికి, రుచి కనిపించలేదు. ఆమెతో పాటు ఒక బాక్సులో దాచిన రూ. 30 వేలు, పెళ్లిలో పెట్టిన నగలు, వస్త్రాలు అన్నీ మాయం అయ్యాయి. అసలేమైందో తెలీక తికమకలో ఉన్న అరవింద్.. రుచికి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన రుచి.. ‘‘నేను నిన్ను ప్రేమించట్లేదు, నాకు మళ్లీ ఫోన్ చేయకు’’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో ఖంగుతిన్న అరవింద్.. తాను అన్యాయంగా మోసపోయినట్టు గుర్తించాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.