Break for Bharat Jodo Yatra on October 17: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతోంది. తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 17న రాహుల్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది. 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర ఒక రోజు పాటు ఆగిపోనుంది.
17న జరిగే ఏఐసీసీ ఎన్నికల కోసం బెంగళూర్ వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 17న సాయంత్రం ఆంధ్రా-కర్ణాటక బోర్డర్ లోని ఛేత్రగుడిలో రాహుల్ బస చేయనున్నారు. అక్టోబర్ 18న ఉదయం 6 గంటలకు ఛేత్రగుడి హనుమాన్ దేవాలంయ నుంచి రాహుల్ గాంధీ యాత్ర మళ్లీ ప్రారంభం అవుతుంది. 19వ తేదీ రాత్రి సమయంలో ఏపీలోకి ప్రవేశిస్తుంది. 20న ఎమ్మిగనూర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 21 వ తేదీ రాత్రి మళ్లీ కర్ణాటకలోని రాయచూర్ కు చేరనుంది పాదయాత్ర.
Read Also: Prakash Raj: డబ్బు కోసమే ప్రకాష్ రాజ్ ఆ పని చేశాడా..?
గతంలో రెండు సార్లు భారత్ జోడో యాత్రకు బ్రేకులు పడ్దాయి. ఓ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీకి వెళ్లారు. అక్టోబర్ 4,5 తేదీల్లో దసరా సందర్భంగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో జరిగిన పాదయాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో, ప్రజలందరిని ఒక్కటి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనుంది. దాదాపుగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి కాశ్మీర్ లో ముగించనున్నారు.