Site icon NTV Telugu

Bombay High Court: వివాహ సమస్యలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు..

Law News

Law News

Bombay High Court: తన భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, తన అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ కొట్టివేసింది. వివాహ వివాదాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయని, మహిళలను రక్షించడానికి ఉద్దేశించిన చట్టాలు దుర్వినియోగం చేసే ధోరణ పెరుగుతోందని కోర్టు గమనించింది. వివాహాలను రక్షించడానికి, వివాదాలను పరిష్కరించడానికి రూపొందించిన చట్టాలు తరుచుగా దుర్వినియోగం అవుతున్నాయని కోర్టు ప్రస్తావించింది.

‘‘ వివిధ కారణాల వల్ల ఈ రోజుల్లో వివాహ సమస్యలు సమాజంలో ఒక సమస్యగా మారింది. ఈ వివాహ విభేదాల కారణంగా పోరాడుతున్న వారికి చట్టంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న చిన్న సమస్య మొత్తం జీవితాన్ని పాడు చేస్తోంది. హిందువుల్లో పవిత్రమైన వివాహాలు ప్రమాదంలో ఉన్నాయి’’ అని న్యాయమూర్తులు నితిన్ సాంబ్రే, ఎంఎం నెర్లికర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

గృహహింస చట్టం, హిందూ వివాహాల చట్టం, ప్రత్యేక వివాహాల చట్టాలు పలువురు తరుచుగా దుర్వియోగానికి గురి చేస్తున్న ఫలితంగా, కోర్టులపై భారం పడుతోందని కోర్టు చెప్పింది. ఇదే కాకుండా ఈ సమస్యలు మానసిక, శారీరక వేధింపులు, అంతులేని సంఘర్షన, ఆర్థిక నష్టం, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులపై కోలుకోలేని హాని కలిగించే అనేక కేసులు నమోదవుతున్నాయని ధర్మాసనం తెలిపింది.

మే 2023ల వివాహం చేసుకున్న జంట కేసును విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ డిసెంబర్ 2023లో నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టం కింద ఆమె భర్త, ఇద్దరు సోదరిణులు, అత్తామామలపై కేసు నమోదు చేసింది. వరకట్న వేధింపులు, అసహజ లైంగిక సంబంధం,భూమి, ఆస్తి కోసం డిమాండ్ చేసినట్లు ఆమె వారిపై ఆరోపించింది. అయితే, ప్రస్తుతం తమ వివాదాలు అన్ని పరిష్కారమయ్యాయని సదరు మహిళ, ఆమె తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణ రద్దు చేయాలని కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. భార్యభర్తలు శాంతియుతంగా జీవించాలనుకుంటే, వారిని ప్రోత్సహించడం కోర్టు విధి అని ధర్మాసనం పేర్కొంది.

Exit mobile version