NTV Telugu Site icon

Bihar: బీహార్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి

Bihar

Bihar

Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది. మరణించిన వారికి సీఎం నితీష్ కుమార్ రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

ఆదివారం బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్ఘియా గ్రామసమీపంలోని బరాండీ నదిలో బోటు అకాస్మత్తుగా బోల్తా పడింది. ఈతగాళ్లు మొత్తం ఏడుగురు మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. స్థానికులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీములు చనిపోయినవారి మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. పడవలో ఉన్న వారంతా మర్గియా గ్రామానికి చెందిన పాశ్వాన్ తోలా వాసులుగా గుర్తించారు.

Read Also: Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్

పడవలో ప్రయాణిస్తున్నవారంతా తమ పొలాల్లో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రైతులు తమ పొలం నుంచి వరిని పడవల్లో తెచ్చుకుంటున్నారు. పొలాల నుంచి గ్రామానికి వేరే మార్గం లేకపోవడంతో పడవల ద్వారానే పంటను తీసుకుస్తున్నారని.. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అంతకుముందు రోజు శనివారం సీఎం నితీష్ కుమార్ కి ప్రమాదం తప్పింది. గంగా నదిలో స్టీమర్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో స్టీమర్ పిల్లర్ ని ఢీకొట్టింది. దీంతో నితీష్ కుమార్ కు స్వల్పగాయాలు అయ్యాయి. ఛఠ్ పూజ సందర్భంగా గంగా నదిలో ఘాట్లను సందర్శించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రతీ ఏడాది ఛఠ్ పూజ సందర్భంగా గంగానదిని సందర్శిస్తుంటారు సీఎం నితీష్ కుమార్. దీపావళి జరిగిన 6 రోజుల తర్వాత ఛఠ్ పూజలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 30 నుంచి ఈ పూజలు ప్రారంభం కానున్నాయి.