ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. నేటి నుంచి 4 నాలుగు రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి భారత్‌కు వచ్చాకే.. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. వర్మ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఇది కూడా చదవండి: Delhi Elections : అప్పుడు అతిషి డ్యాన్స్.. ఇప్పుడు సౌరభ్ భరద్వాజ్ ఏడుపు.. వైరల్ అవుతున్న వీడియోలు
సీఎం రేసులోకి మరికొంది పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మాలవీయ నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించకుండా ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని అడ్డుకున్న సతీష్ ఉపాధ్యాయ, జనక్‌పురి స్థానం నుంచి కొత్త ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ప్రస్తుతం రోహ్తాస్ నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్ర మహాజన్, రోహిణి స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజేందర్ గుప్తా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం ఉన్న ప్రభుత్వ బంగ్లా ‘‘శీష్ మహల్’’లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోరని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నివసించిన సివిల్ లైన్స్‌లోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా ‘‘శీష్ మహల్’’ను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి నివసించరని వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో బంగ్లా పునరుద్ధరణలో భారీ స్కామ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఎంతేకాకుండా శీష్ మహల్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అందులో ఉండబోరని వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇంకెప్పుడమ్మా!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాకే.. ఢిల్లీ సీఎం ఎంపిక ఉండనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.