NTV Telugu Site icon

Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్‌.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?

Maha

Maha

Maharashtra Cabinet: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం ప్రతిష్టంభన ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా క్యాబినెట్‌ కూర్పుపైనా మహాయుతి కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే, మంత్రిమండలిలో సగం బెర్త్‌లు బీజేపీ దగ్గరే ఉంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక శాఖలతో పాటు 12 మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తుంది.

Read Also: BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..

కాగా, మహారాష్ట్ర మంత్రి మండలిలో గరిష్ఠంగా 43 మంది మంత్రులను నియమించుకునే ఛాన్స్ ఉంది. ఇందులో 20కి పైగా పదవులను భారతీయ జనతా పార్టీ తీసుకునేందుకు మహాయుతి కూటమి నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రచురించింది. శివసేన(షిండే)కు 13, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 క్యాబినెట్‌ సీట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇక, కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో షిండే వర్గానికి పట్టణాభివృద్ధి, ప్రజా పనుల అభివృద్ధి, జల వనరుల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Bajrang Punia: నేను బీజేపీలో చేరి ఉంటే ఏ నిషేధం ఉండేది కాదు.. నాడాపై బజరంగ్ పునియా ఫైర్

అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు మహాయుతి నేతలు ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ ఈరోజు (నవంబర్ 28) ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో చర్చలు కొనసాగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అనంతరం తదుపరి సీఎంపై ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ వైపే మొగ్గే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తుంది. ఈనెల 30న గానీ, వచ్చే నెల 1వ తేదీన గానీ నూతన సర్కార్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు సమాచారం.