BJP MP Ravi Kishan: యూపీలోని గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు నలుగురు పిల్లలు ఉండటం తన తప్పు కాదని.. జనాభా నియంత్రణ బిల్లు తీసుకురాని కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు అని రవికిషన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జనాభా నియంత్రణ బిల్లు తెచ్చి ఉంటే తనకు నలుగురు కంటే తక్కువ పిల్లలు ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లుపై కసరత్తు చేస్తోందని రవికిషన్ వివరించారు. శుక్రవారం నాడు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బీజేపీ ఎంపీ రవికిషన్‌ను యాంకర్ పలు ప్రశ్నలు అడిగారు. ‘మీకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జనాభా నియంత్రణ బిల్లు కావాలని కోరుతున్నారు. దీనిపై మీరేమంటారు?’ అని యాంకర్ ప్రశ్నించారు.
Read Also: Viral News : పాపం.. ప్రేమగా చూసుకున్న కుక్క కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు
ఈ ప్రశ్న పట్ల బీజేపీ ఎంపీ రవికిషన్ స్పందిస్తూ.. ‘నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇది నా తప్పు కాదు. కాంగ్రెస్ బిల్లు తెచ్చి చట్టం చేసి ఉంటే, మాకు నలుగురు పిల్లలు పుట్టేవారు కాదు’ అని అన్నారు. ఈ వ్యవహారంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించలేదని రవికిషన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుత జనాభా పెరుగుదలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. జనాభా విస్ఫోటనం గురించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నానని… తనకు నలుగురు పిల్లలు ఉండటంపై పశ్చాత్తాపం చెందుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చైనాపై రవికిషన్ ప్రశంసలు కురిపించారు. జనాభా నియంత్రణ విషయంలో చైనా మాదిరిగా గత ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే తరతరాల వారికి కష్టాలు ఉండేవి కావన్నారు.