NTV Telugu Site icon

Maharashtra: ఎలక్షన్ రిజల్ట్స్‌కి ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ఉద్ధవ్ సేనలో చేరిన కీలక నేత..

Maharashtra

Maharashtra

Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు. ముంబై బీజేపీ కార్యదర్శి, మహిమ్‌కి చెందిన సీనియర్ నేత సచిన్ షిండే, ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చేరారు. ఇది బీజేపీ ఊహించని షాక్‌గా చెప్పవచ్చు. షిండే తన మద్దతుదారులతో కలిసి ఠాక్రే నివాసం మాతోశ్రీలో పార్టీలో చేరారు.

Read Also: US: యూఎస్‌ బీచ్‌లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?

షిండే మణికట్టుకు సంప్రదాయ ‘‘శివబంధన్’’ని కట్టి ఠాక్రే పార్టీలోకి స్వాగతించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిమ్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆయన కుమారుడు అమిత్ ఠాక్రేను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) మహేష్ బలిరామ్ సావంత్‌ను తమ అభ్యర్థిగా దింపింది. ఏక్ నాథ్ షిండే శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సదరా సర్వాంకర్‌ని నిలబెట్టింది.

288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ‘మహాయుతి’ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలు ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహాయుతి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.