Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..

  • బీజేపీకి ఇదే మంచి సమయం..
  • డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్..
  • టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి ఆసరా..
Delimitation Bill

Delimitation Bill

Delimitation Bill: దేశ రాజకీయాలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి. ప్రతిపక్షాల ఐక్యత పేకమేడలా కూలిపోతోంది. ఇండియా కూటమికి మిత్రపక్షాలు షాక్ ఇస్తున్నాయి. ఇక ఇన్నాళ్లు బీజేపీని ఎదురించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం, మమతా బెనర్జీ ఘోర పరాజయం, డీఎంకే ఓటమి ఇలా అన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరగడం బీజేపీకి ప్లస్‌గా మారబోతోంది. డీలిమిటేషన్ బిల్లు, 2026 ఆమోదం కోసం ఎన్డీయే ప్రభుత్వం పావులు కదుపుతోంది. బిల్లు చట్టంగా మారడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది.

మమతా బెనర్జీపై తిరుగుబాటు:

మమతా బెనర్జీకి రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ ఆమెకు దక్కకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యే ఉంటే, 60 మంది మమతా దీదీపై తిరుగుబాటు చేశారు. వీరంతా రీటబ్రత బెనర్జీ నేతృత్వంలో రెబల్ వర్గంగా మారారు. రీటబ్రతనే ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక ఎంపీలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. 20 మంది ఎంపీలు రెబల్ వర్గం, బీజేపీలతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

×
×
Ad

లోక్‌సభలో టీఎంసీకి 28 మంది, రాజ్యసభలో 13 మంది మొత్తంగా 41 మంది ఎంపీలు ఉన్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే వీరి మద్దతు చాలా అవసరం. ఇప్పుడు లోక్‌సభ ఎంపీల్లో 23 మంది టీఎంసీ రెబల్ వర్గంగా మారితే తమ పని సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది.

కాంగ్రెస్‌కు దూరంగా డీఎంకే:

ఇక డీఎంకే కూడా ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయింది. ఇండియా కూటమిలో మరో పెద్ద పార్టీ. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని మొదటి నుంచి వాదిస్తోంది. కాంగ్రెస్‌ ఈ విషయంలో అండగా నిలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో డీఎంకే డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు చేసింది. అయినప్పటికీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. డీఎంకే దయతో 5 స్థానాలను గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు టీవీకే విజయ్ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్‌ను ఇక జన్మలో నమ్మేది లేదని, వెన్నుపోటుదారుడిగా డీఎంకే అభివర్ణిస్తోంది.

డీఎంకేకు లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 10 మంది ఎంపీలు మొత్తం 32 ఎంపీలు ఉన్నారు. ఇప్పటికే బీజేపీ సర్కార్ డీఎంకేతో తెర వెనక చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ రెండు పార్టీలు కలిసి వస్తే రెండు సభల్లో 2/3 వంతు మెజారిటీ సాధ్యమవుతుంది

డీలిమిటేషన్‌పై బీజేపీ ఫోకస్:

2029లోపు డీలిమిటేషన్ బిల్లు ఆమోదింపజేయాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది సాధ్యంకాలేదు. డీలిమిటేషన్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తుంది. దీని ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి 850కి పెంచాలని చూస్తోంది. ఇందులో 815 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి. మొత్తం 50 శాతం సీట్ల సంఖ్య పెరగుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ ద్వారా 273 స్థానాలు కేటాయిస్తారు.

ఒక రాజ్యాంగ సవరణ బిల్లు, కాబట్టి దీనిని పార్లమెంటు ఉభయ సభలలో “మూడింట రెండు వంతుల (2/3) ప్రత్యేక మెజారిటీ”తో ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చేసిన తొలి ప్రయత్నంలో బీజేపీ విఫలమైంది. ఆ సమయంలో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటం వల్ల కేంద్ర ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.