Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!

  • లక్షకు పైగా మెజారిటీతో ‘పాండా’ సంచలన విజయం
  • ఫోర్త్ ప్లేస్‌కు పడిపోయిన టీఎంసీ
West Bengal Politics

West Bengal Politics

Falta Re-polling Result: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ‘ఫల్తా’ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉత్కంఠభరిత రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ రీపోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1,08,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోలుకోలేని షాక్ తగిలి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది.

డైమండ్ హార్బర్ కోటలో బీజేపీ జెండా!
ఈ విజయం సాధారణమైనది కాదు.. ఎందుకంటే ఫల్తా నియోజకవర్గం టీఎంసీ నెంబర్-2, ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన ‘డైమండ్ హార్బర్’ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కమలం వికసించడం.. బెంగాల్ రాజకీయాల్లో ఇక మమతా బెనర్జీ మార్క్ హవాకు బ్రేకులు పడ్డాయనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

వివాదాల నుంచి రీపోలింగ్ వరకు.. అసలేం జరిగిందంటే
ఈ స్థానానికి తొలిసారిగా ఏప్రిల్ 29న పోలింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో అధికార టీఎంసీ ఈవీఎంల తారుమారుకు పాల్పడిందని, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం వంటి అక్రమాలకు ఒడిగట్టిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో నెలకొన్న తీవ్రతను గమనించిన ఎన్నికల సంఘం (EC) అక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, మే 21న కట్టుదిట్టమైన కేంద్ర బలగాల నిఘాలో మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించింది. ఈసారి భయం లేకుండా దాదాపు 88 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ప్రశాంతంగా ఓటు వేశారు. ఈరోజు (మే 24, ఆదివారం) జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ పెరుగుతూ పోయింది..

దేబాంగ్షు పాండా (BJP): 1,49,666 ఓట్లు (విజేత)

శంభు నాథ్ కుర్మి (CPM): 40,645 ఓట్లు (రెండో స్థానం)

అబ్దుర్ రజాక్ మొల్లా (Congress): 10,084 ఓట్లు (మూడో స్థానం)

జహంగీర్ ఖాన్ (TMC): 7,783 ఓట్లు (నాలుగో స్థానం – డిపాజిట్ గల్లంతు)

ట్విస్ట్ ఏంటంటే.. ఈ రీపోలింగ్‌కు ముందే ఓటమిని పసిగట్టిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తాను పోటీలో నిలబడనని ముఖం చాటేయడం గమనార్హం. అయితే చివరకు ఆయనకు ఈ ఎన్నికల్లో దక్కింది కేవలం 7 వేల పైచిలుకు ఓట్లే. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాజీ సీఎం మమతా బెనర్జీ రిజల్ట్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “బీజేపీ ఏజెంట్లలా నటిస్తూ కేంద్ర బలగాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి దూరి ఓట్లను మళ్లీ దొంగిలించాయి” అంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ ఘనవిజయంపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందిస్తూ.. టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభిషేక్ బెనర్జీ చెప్తుండే ‘డైమండ్ హార్బర్ మోడల్’ కాస్తా ఇప్పుడు ‘తృణమూల్ నష్ట నమూనా’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తాను ప్రజలను లక్ష మెజారిటీ అడిగితే.. వారు 1.08 లక్షల మెజారిటీతో నమ్మకాన్ని నిలబెట్టారని, ఫల్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్లీ ‘స్వర్ణ వైభవాన్ని’ తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.