Nitin Nabin: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వివత్తులో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సంస్థలు భారత్ అభివృద్ధిపై సానుకూల నివేదికలు ఇస్తున్నా.. రాహుల్ గాంధీ వీటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం చండీగఢ్‌లో బీజేపీ బూత్ కార్యకర్తల్ని ఉద్దేశించిన నితిన్ నబీన్ ప్రసంగించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘ఈ దేశంలో పుట్టి, ఈ నేలపై జీవించి, ఇక్కడి నుంచే అన్ని పొందిన కొందరు వ్యక్తులు విదేశాలకు వెళ్లి ఇదే దేశాన్ని అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు. ఐఎంఎఫ్ వంటి సంస్థలు భారత్ అభివృద్ధి చెందుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
ప్రధాని నరేంద్రమోడీని బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీ చేసిన సవాల్‌పై మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రకటనలు చేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఈ అంశాలపై మాట్లాడే ధైర్యం కూడా ఆయనకు లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీతో చర్చించడానికి బీజేపీ మండలాధ్యక్షుడు చాలు అని ఆయన అన్నారు.
ఎన్నికల ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను నితిన్ నబీన్ సమర్థించారు. ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. ఓట్ల చోరీ ఎక్కడా జరగలేదని, తమ రాజకీయ పునాదుల్ని కాపాడుకోవడానికి కొందరు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

