భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం.
ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హేళన కూడా చేశారు. అయినా.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన ప్రయత్నం తాను చేస్తున్నారు. బహుశా ఆమె లక్ష్యం ఈ అసెంబ్లీ ఎన్నికలు కాకపోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తీసుకురావాలని అనుకుంటున్నారామె. నిజానికి కాంగ్రెస్ పునరుత్థానం కోసం ప్రియాంక తన వ్యూహాలను ఈ అసెంబ్లీ ఎన్నికలలో అమలు చేస్తున్నారు. అయితే గత 25 సంవత్సరాలలో యూపీ కాంగ్రెస్ క్రమానుగత పతానాన్ని మాత్రమే చూసింది. మరి దీనిని ప్రియాంక అధిగమిస్తారా?
1985 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 269 సీట్లతో అధికారం చేపట్టింది. అప్పుడు బీజేపీ సాధించింది కేవలం 16 స్థానాలు. అంతకు ముందు 1984 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 85 స్థానాలను హస్తం పార్టీ స్వీప్ చేసింది. దాంతో పాటు అత్యంత కీలకమైన హిందీ రాష్ట్రాలలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అదే సమయంలో అది కొన్ని స్వయంకృతాపరధాలు చేసింది. తద్వారా స్వీయనాశనాన్ని కొని తెచ్చుకుంది. షా బానో కేసు, సల్మాన్ రష్దీ పుస్తకంపై నిషేధం, శిలాన్యాస్ కోసం అయోధ్య తలుపులు తెరవడం వంటి రాజకీయ తప్పులకు పాల్పడి యూపీ అనే బంగారు కానుకను వెండి పళ్ళెంలో పెట్టి బీజేపీకి అప్పగించింది.
1984లో 404 లోక్‌సభ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలం 1989 ఎన్నికల నాటికి 207 స్థానాలకు పడిపోయింది. దాంతో 1991 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 221 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. కేవలం ఆరేళ్లలో కాంగ్రెస్ ఆవిరైపోయింది. 46 సీట్లకు పరిమితమైంది. అంటే 1985 నుంచి 91 వరకు 83 శాతం పతనమైంది. అదే సమయంలో బీజేపీ బలం 14 రెట్లు పెరిగింది.
1984లో కేవలం రెండు లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ 1989 నాటికి 85 సీట్లకు ఎగబాకింది. ఇదంతా నాడు రాజీవ్ గాంధీ తప్పులకు కాంగ్రెస్ చెల్లించిన మూల్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు హస్తం పార్టీ పతనం అంచెలంచెలుగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు దీనికి విరుద్ధంగా బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. 2009లో 116 స్థానాలు గెలిచిన బీజేపీ 2014లో 282 సీట్లు గెలిచి పూర్తి మెజార్టీ సాధించింది. అంటే దాని వృద్ధి రేటు 143 శాతం. అదే సమయంలో 2009లో 206 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ బలం 2014 నాటికి 44 సీట్లకు పరిమితమైంది. 2019లో కూడా దానిని పరిస్థితి ఏమీ మారలేదు. కానీ బీజేపీ తన సంఖ్యను 303కి పెంచుకుంది.
బీజేపీ దూకుడుగా అనుసరిస్తున్న కమ్యునల్ పోలరైజేషన్, భారీ ప్రచారం, ఓటర్ల సమీకరణ, ఆకట్టుకునే ప్రసంగాలు దాని ఎదుగుదలకు దోహదం చేశాయి. కానీ, కాంగ్రెస్ ఓటమి కథ మరీ విచిత్రం అనిపిస్తుంది. దాని పరిస్థితి హెడ్‌లైట్లకు ఆగిపోయిన జింకలా అనిపిస్తుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ వరసగా 71, 62 స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ 2, 1 సీట్లలో గెలిచింది. ఒక్కసారి అధికారం చేజారితే దానిని తిరిగి దక్కించుకోవటం కాంగ్రెస్‌కు కష్టంగా మారింది.
వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనం రాత్రికి జరిగింది కాదు. 1996 నుంచి దాని ఓట్ల శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితం. గత పాతిక సంవత్సరాలలో యూపీలో అది అత్యధికంగా 1996లో 33 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో 22 సీట్లు సాధించింది. ఇంతకు మించి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రదర్శన గొప్పగా లేదు. కాంగ్రెస్ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికలలో కేవలం 44 స్థానాలకు పరిమితం అయింది. అలాగే 2019లో 52 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మరోవైపు బీజేపీ విషయం ఇందుకు పూర్తిగా భిన్నం. 1991లో యూపీ అసెంబ్లీలో 221 సీట్ల నుంచి, 2002లో 88కి, 2007లో 51కి, 2012లో 47కి పడిపోయినా ఏనాడూ అది పూర్తిగా కూలిపోలేదు. ప్రతి ఎన్నికల్లో కనీసం 15-17 శాతం మధ్య ఓటు షేర్ సాధిస్తూ వచ్చింది. 2017లో 312 సీట్లతో అద్భుత విజయం సాధించటానికి పునాది ఆ ఓట్లే. అదే సమయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం యూపీ కాంగ్రెస్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. కార్యకర్తలను తీవ్రంగా కుంగదీసిన పాపం పార్టీదే. యూపీ మాత్రమే కాదు జాతీయంగా కూడా కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు. యూపీ గణాంకాలు చెబుతున్నట్టుగా ఓటమి తరువాత కాంగ్రెస్ తనను తాను పెంచుకునే బదులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశాలో నేడు కాంగ్రెస్ పరిస్థితి అందుకు ఉదాహరణ. సుదీర్థ కాలంగా సాగుతున్న ఈ పతనానికి కాంగ్రెస్ వద్ద హేతుబద్ధంగా సమర్థించుకోలేదు.
కాంగ్రెస్‌కు భిన్నంగా బీజేపీ పరాజయం పాలైనప్పుడు కుంగిపోలేదు. 1991 నుంచి దాని అతితక్కువ లోక్‌సభ సీట్లు 116. కాంగ్రెస్ తనను తాను నిర్మూలించుకుంటుండగా, బీజేపీ తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటోంది. ఢిల్లీనే ఉదాహరణగా తీసుకుంటే షీలా దీక్షిత్ హయాం ముగిసిన తరువాత అక్కడ కాంగ్రెస్ ఘోరంగా పతనమైంది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీలో దానికి ఒక్క సీటు కూడా లేని దుస్థితి.
ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ చేతిలో బీజేపీ దెబ్బతిన్నదే అనుకుందాం. అయినా 2024లో దాని గెలుపు అవకాశాలకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలను రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటంగా ప్రజలు చూస్తారు. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్.. బీజేపీ మధ్య పోలికే లేదు. మరి ప్రియాంకా గాంధీ ఎందుకు 2024 లోక్‌సభ ఎన్నికలకు బలహీన కాంగ్రెస్‌ను సిద్ధం చేయటానికి అంతలా శ్రమిస్తున్నారు? బహుశా 1977లో 153 నుంచి 1980లో 353 స్థానాలకు చేర్చిన ఇందిరాగాంధీ స్ఫూర్తి కావచ్చు.
మరోవైపు, బీజేపీ తన అనైతిక ‘సామ, దాన, దండ్, భేద్’ రాజకీయాలకు తగిన మూల్యం చెల్లించే అవకాశమూ లేకపోలేదు. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలను గంగలో కలిపిందన్న అపప్రదను మోస్తోంది. రాజకీయాలను ఇచ్చి పుచ్చుకునే వ్యాపారంగా మార్చిందనే ఆరోపణలూ దానిపై ఉన్నాయి. చివరగా రాజకీయాల్లో శాశ్వతంగా గెలిచేవారూ, ఓడిపోయేవారూ ఉండరు. ఈ సంగతి వారికి తెలియంది కాదు. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.