Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్‌బీర్ భేటీ..

  • పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
  • బీజేపీ-అకాలీదళ్ మధ్య పొత్తుపై ఊహాగానాలు..
  • మోడీతో భేటీ అయిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్..
Punjab Politics

Punjab Politics

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో శిరోమణి అకాలీ దళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఢిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కలయికతో బీజేపీ-అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం పార్లమెంట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశం అనంతరం సుఖ్‌బీర్ బాదల్ మాట్లాడుతూ.. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు. పొత్తులు, ఎన్నికలపై ఇరు పార్టీలు కూడా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

25 ఏళ్ల పొత్తు.. వ్యవసాయ చట్టాలతో ముగింపు..

బీజేపీ, శిరోమణి అకాలీదళ్ దాదాపుగా 25 ఏళ్ల పాటు పంజాబ్ రాజకీయాల్లో కలిసి ఉన్నాయి. అయితే, 2020లో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ముగిసింది. ఎన్డీయే కూటమి నుంచి అకాలీదళ్ వైదొలిగింది. ఆ తర్వాత 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. కానీ రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి.

ఎన్నికల ముందు జోరుగా ఊహాగానాలు:

ఈసారి పంజాబ్‌ ఎన్నికల్లో 5 పార్టీల పోటీ నెలకొంది. అధికార ఆప్, కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, అమృత్‌పాల్ సింగ్‌కు చెందిన వారిస్ పంజాబ్ దే పార్టీల మధ్య పోటీ ఉంది. మరోవైపు, వారిస్ పంజాబ్ దే పార్టీ పూర్తిగా సిక్కు రాజకీయాలపై ఆధారపడి ఉంది. ఇదే విధంగా సిక్కు రాజకీయాలపై ఎదిగిన అకాలీదళ్‌కు అమృత్ పాల్ సింగ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దేశవ్యతిరేక కార్యకలాపాల కింద ఎంపీ అమృత్ పాల్ సింగ్ జైలులో ఉన్నారు. అయినప్పటికీ, అతడి పార్టీ నెమ్మదిగా అకాలీదళ్ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో మోదీ-సుఖ్‌బీర్ సమావేశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీతో కలిసి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని అకాలీదళ్ భావిస్తోంది. సిక్కు ఓట్లతో పాటు హిందూ ఓట్లను పొందిగే పంజాబ్‌లో విజయం సాధించే అవకాశం ఉందని లెక్కలు వేస్తోంది. మరోవైపు, బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పంజాబ్ లో సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలే ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే గ్రామీణ ప్రాంతాల్లో సిక్కు ఓట్లను, పట్టణ ప్రాంతాల్లో హిందూ ఓట్లను సాధించే అవకాశాలు మెరుగవుతాయి.