BJP action plan on 2024 elections: బీజేపీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. టార్గెట్ 2024పై ఢిల్లీలో బీజేపీ మేథోమధన సదస్సు జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేసే పనిలో ఉంది బీజేపీ. మంగళవారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో కేంద్ర మంత్రులతో సమావేశం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, యూపీలో బలపడేందుకు కసరత్తు చేస్తోంది.
2019లో బీజేపీ 144 సీట్లను స్వల్ప తేడాతో కోల్పోయింది. అయితే ఈ 144 స్థానాల్లో బలపడేందుకు, వచ్చే ఎన్నికల్లో వీటిలో బీజేపీ గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టారు. 2019లో 543 లోక్ సభ స్థానాల్లో 303 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 53 స్థానాాలు సాధించాయి. తాజాగా జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా కొన్ని నియోజక వర్గాలపై బీజేపీ దృష్టి సారించింది. కొన్ని లోక్ సభ స్థానాల బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు.
Read Also: Ration In Mercedes Benz Car: చాలా పూర్..! బెంజ్ కారులో రేషన్ కోసం వచ్చాడు..
నియోజకవర్గాలను సందర్శించి క్షేత్ర స్థాయిలో పర్యటించి అభిప్రాయాలను తెలియజేయాలని అధిష్టానం కోరింది. ప్రతీ సీటుపై వ్యూహాలను రూపొందిస్తోంది. పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలని మంత్రులకు సూచించారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి కసరత్తు ప్రారంభించింది. రానున్న ఎన్నికల్లో మెజారిటీ సాధించే విధంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే దానిపై ఓ నివేదిక తయారు చేసిన మంత్రులు దాన్ని జేపీ నడ్డాకు సమర్పించారు. మరోసారి యూపీ రాష్ట్రాన్ని టార్గెట్ చేయబోతోంది బీజేపీ. యూపీలో గెలిచిన వారే ఢిల్లీలో అధికారాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే యూపీతో పాటు ఈ సారి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయంగా సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. రానున్న కాలంలో ఇలాంటి సమావేశాలు ఉంటాయని బీజేపీ చెబుతోంది.