కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు దేశంలో ఇప్పటికే పలు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీరం కోవీషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్‌డీ వ్యాక్సిన్‌కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో టీకా అందుబాటులోకి రాబోతున్నది. బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. అయితే పెద్దవాళ్లకు అందించే వ్యాక్సిన్‌కు అనుమతులు ఇవ్వగా, 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల చిన్నారులకు సంబంధించిన వ్యాక్సిన్ కోసం అనుమతులు కోరింది.
Read: RIL: భళా రిలయన్స్… ఆ కంపెనీలు నష్టపోయినా… ఆర్ఐఎల్ మాత్రం…
చిన్నారులకు వ్యాక్సిన్‌కు సంబంధించి తుదిదశ ప్రయోగాల కోసం గతేడాది సెప్టెంబర్ నెలలోనే అనుమతులు కోరింది. సెప్టెంబర్ నుంచి ట్రయల్స్ ను నిర్వహించారు. మధ్యంతర ఫలితాలను విశ్లేషించిన అనంతరం 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసువారికి వ్యాక్సిన్ అందించేందుకు ఇవ్వాలని కోరుతూ డీసీజీఐకి ధరఖాస్తు చేసుకున్నారు. ఇక పెద్దవయసువారికి సంబంధించిన కార్బెవాక్స్ టీకాల కోసం కేంద్రం 5 కోట్ల డోసులకు ఆర్డర్ చేసినట్లు బయోలాజికల్ ఇ సంస్థ పేర్కొన్నది. ఒక్కోడోసు రూ. 145 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తున్నది. కేంద్రం కొనుగోలు చేస్తున్న డోసులను ప్రికాషనరీ డోసుగా ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది.