Bihar: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి దేశ అత్యున్నత పురస్కారం ‘‘భారతరత్న’’ ఇవ్వాలని ఆ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తాకింది. లాలూకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బీహార్ అసెంబ్లీ బుధవారం తిరస్కరించింది. బుధవారం ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మరోసారి బీహార్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. బీహార్ ప్రభుత్వం అత్యున్నత అవార్డు కోసం లాలూ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.
ఈ ప్రతిపాదనపై ప్రతిస్పందిస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది భారతరత్న, పద్మ అవార్డుల కోసం సిఫారసులు చేస్తుందని, కానీ లాలూ యాదవ్ కోసం ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి లాలూకు భారతరత్న అవార్డు సిఫారసు చేసే ప్రతిపాదన బీహార్ ప్రభుత్వం దృష్టి లేదని చెప్పారు.
Read Also: Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ప్రతిపాదన ప్రవేశపెట్టిన ముఖేష్ రోషన్ తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కూడా విజయ్ కుమార్ కోరారు. అయితే, రోషన్ అంగీకరించకపోవడంతో, స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్ మూజువాణి ఓటులో ప్రతిపాదనను తిరస్కరించారు. మెజారిటీ అసెంబ్లీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రజల్లో భావోద్వేగాలు పెంపొందించేందుకు ఆర్జేడీ చేసిన ప్లాన్‌గా అధికార జేడీయూ కూటమి ఈ చర్యను చూస్తోంది. లాలూ సామాజిక న్యాయం, వెనకబడిన తరగతుల సాధికారతకు కృషి చేశారని, ఆయన భారతరత్నకు అర్హుడని ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ అన్నారు.