Site icon NTV Telugu

Bangladesh crisis: 1971 తర్వాత భారత్‌కు అతిపెద్ద సవాల్.. “బంగ్లాదేశ్‌”పై పార్లమెంటరీ ప్యానెల్ రిపోర్ట్..

Bangladesh

Bangladesh

Bangladesh crisis: 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, ఇప్పుడు భారతదేశానికి వ్యూహాత్మక సవాల్‌గా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేత‌ృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ప్రభావం, షేక్ హసీనా పదవిని కోల్పోవడం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ సమయంలో భారత్ తన వ్యూహాన్ని పున: సమీక్షించుకోకపోతే, యుద్ధం వల్ల కాదు కానీ , ప్రాధాన్యత కోల్పోవడం వల్లే, ఢాకాలో భారత్ వ్యూహాత్మక ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ హెచ్చరించింది.

Read Also: Omar Abdullah: ఒక ముస్లిం హిందూ మహిళ ముసుగు తీస్తే పరిస్థితి ఏంటి.?

‘‘1971లో సవాలు మనుగడకు సంబంధించింది, మానవతావాదానికి సంబంధించింది, ఒక కొత్త దేశం ఆవిర్భావానికి సంబంధించింది కాగా, ఇప్పుడు సవాల్ మరింత తీవ్రమైంది. ఇది తరాల మధ్య అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారతదేశం నుంచి దూరంగా ఒక సంభావ్య వ్యూహాత్మక పున:సమీకరణకు సంబంధించింది’’ అని కమిటీ పేర్కొంది. పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు, బంగ్లాలో చైనా పెట్టుబడుల విషయంలో కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోంగ్లా పోర్ట్, లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్, పెకువాలో జలాంతర్గామి స్థావరం వంటి ప్రాజెక్టులను ఉదహరించింది.

ఇదే కాకుండా, బంగ్లాలోని జమాతే ఇస్లామితో సహా అన్ని వర్గాలను చైనా కలుపుకుపోతోందని చెప్పింది. బంగ్లాలో విదేశీ శక్తులు సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని, అభివృద్ధి, కనెక్టివిటీ, ఓడరేవుల యాక్సెస్‌లో బంగ్లాదేశ్‌కు ప్రయోజనాలను అందించాలని ప్యానెల్ సిఫారసు చేసింది. బంగ్లాలో పెరుగుతున్న రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడటాన్ని ప్యానెల్ ఎత్తిచూపింది. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం బంగ్లాదేశ్ భవిష్యత్తులో జరిగే ఏవైనా ఎన్నికలలో అందరినీ కలుపుకునే సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పింది.

Exit mobile version