NTV Telugu Site icon

Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..

Pannun

Pannun

Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అమెరికన్ పౌరుడైన పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు ప్రయత్నించారనే విషయాన్ని అక్కడి బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని చెక్ రిపబ్లిక్‌ దేశంలో అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిఖిల్ గుప్తాకు, భారత ప్రభుత్వ ఉద్యోగి సహకరించాడని యూఎస్ న్యాయశాఖ అభియోగపత్రాలు పేర్కొన్నాయి. ఆ భారత ఉద్యోగిని cc1 అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇతనే గుప్తాకు డైరెక్షన్స్ ఇచ్చాడని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు.

Read Also: Putin: 8 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యా మహిళలకు పుతిన్ పిలుపు..

ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన గూఢచారి సంస్థ సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌ని భారత్‌కి పంపినట్లు రాయిటర్స్ నివేదించింది. పన్నూ హత్యలో భారత ప్రమేయం ఉందని వస్తున్న నేపథ్యం ఆయన భారతదేశంలోని అత్యున్నత స్థాయిలో చర్చించడానికి, విచారణ కోసం భారత్ వస్తున్నట్లు తెలుస్తోంది.

సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఈ ఏడాది ఆగస్టులో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) చీఫ్ రవి సిన్హాతో భేటీ అయి.. భారతదేశం దర్యాప్తు చేసి బాధ్యులు జవాబుదారీగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరగకూడదని హమీ ఇవ్వాలని కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. జూలై 2023 చివర్లోనే ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. దీనిపై భారత్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీ20 సదస్సులో ప్రధాని మోడీతో జోబైడెన్ సమావేశం జరిగిన సమయంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది.