Punjab: పంజాబ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రేప్ కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన భార్య గుర్‌ప్రీత్ కౌర్ మధ్యవర్తుల ద్వారా రేప్ కేసులను డబ్బులు తీసుకుని సెటిల్ చేసే రాకెట్ నడుపుతున్నారని బీజేపీ సంచలన ఆరోపణ చేసింది. ఒక్కో కేసును సెటిల్ చేసేందుకు రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్పులను విడుదల చేశారు. వాటిలో ఓ వ్యక్తి తన రాజకీయ పరిచయాలను ప్రస్తావిస్తూ రేప్, ఇతర క్రిమినల్ కేసులను సెటిల్ చేయడం గురించి మాట్లాడుతున్నట్లు ఉందని ఆయన తెలిపారు.
సీఎం భగవంత్ మాన్, ఆయన భార్య కలిసి అవినీతి, దోపిడీ రాకెట్ నడుపుతున్నారని ప్రదీప్ భండారీ ఆరోపించారు. మధ్యవర్తుల ద్వారా చట్టబద్ధమైన రేప్ కేసులను కూడా రూ.5 కోట్లతో సెటిల్ చేస్తున్నారని అన్నారు. సీఎం వ్యక్తిగతంగా ఈ కేసుల్ని సెటిల్ చేసేందుకు జోక్యం చేసుకుంటున్నారా.? అని ప్రశ్నించారు. సీఎం నివాసం నుంచే ఈ డీల్స్ జరుగుతున్నాయా..? డబ్బుల్లో వాటా పంజాబ్‌లోని సూపర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చేరుతోందా? అని ప్రశ్నించారు.
రేప్ కేసు ఏంటి..?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గుర్విందర్ సింగ్ చాహల్‌కు సంబంధించిన రేప్ కేసు నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలపై చాహల్‌ను అరెస్ట్ చేశారు. అయితే, కొంతకాలం తర్వాత విడుదలయ్యారు. ఏప్రిల్ 29న అమృత్‌సర్‌లో కేసు నమోదు కాగా, మే 1న బాధితురాలిని పోలీసులు గుర్తించారు. అనంతరం రేప్ ఆరోపణలు చేర్చారు. మే 13న చాహల్‌ను అరెస్ట్ చేశారు. తరువాత ఆయన విడుదల కావడంతో కేసు దర్యాప్తుపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఈ కేసులో బాధితురాలి తండ్రి పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో జూలై 20న ఈ కేసు గత దర్యాప్తుతో సంబంధం లేకుండా సీనియర్ పోలీస్ అధికారితో చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
రూ. 5 కోట్ల ఆరోపణలు..
ఈ కేసును సెటిల్ చేసేందుకు రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఆగస్టులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దృష్టికి వెళ్లాయి. పంజాబ్ సీఎస్, డీజీపీని విచారణ జరిపి యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని హక్కుల సంస్థ ఆదేశించింది. అయితే, తనపై వస్తున్న ఆరోపణల్ని సీఎం భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ ఖండించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. సీఎంను టార్గెట్ చేసేందుకు తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తి ఆరోపణలు ఎదుర్కొంతటున్న సిమ్రంజిత్ సింగ్ హుండాల్ కూడా స్పందిస్తూ.. తాను సీఎం భార్యను ఎప్పుడూ కలవలేదని అన్నారు.

