Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్‌ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Fake Protein Powder: నకిలీ ప్రోటీన్ పౌడర్‌ను గుర్తించేందుకు.. ఈ టిప్స్ పాటించండి
డిసెంబర్ 09న అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ లేఖ రాసి, గంటకు పైగా వీడియోని రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను భార్య, అత్తమామలు ఎలా వేధించారనే విషయాన్ని వెల్లడించారు. తప్పుడు వరకట్నం, వేధింపుల కేసులతో తన నుంచి ఎక్కువ డబ్బు లాగే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆత్మహత్య తర్వాత డిసెంబర్ 14న నికితా సింఘానియాను గురుగ్రామ్ నుంచి అరెస్ట్ చేయగా, ఆమె తల్లి, సోదరుడు అనురాగ్‌ని యూపీ ప్రయాగ్ రాజ్ నుంచి అరెస్ట్ చేశారు.
సుభాష్, సింఘానియా 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఒక బాబు జన్మించారు. ప్రస్తుతం సుభాష్ తల్లిదండ్రులు తమ నాలుగేళ్ల మనవడి కస్టడీని తమకు అప్పగించాని కోరారు. నిఖిల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశంలో వరకట్న వేధింపులు చట్టాలను మరోసారి సమీక్షించాలనే డిమాండ్‌కి కారణమైంది. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. దీనికి తోడు భరణంపై కూడా మార్గనిర్దేశకాలను సెట్ చేయాలని డిమాండ్ చేశారు.