Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో అప్పటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్ నేతలతో సహా 45 మందికి అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
Read Also: Shocking: మమ్మల్ని కలిపి దహనం చేయండి.. ఆర్మీ, ఐఏఎఫ్ జంట ఆత్మహత్య..
వారెంట్లు కోరుతూ ప్రాసిక్యూషన్ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. జస్టిన్ ఎండీ గోలం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 17న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 18 నాటికి హసీనా, ఇతరులను అరెస్ట్ చేసి ట్రిబ్యునల్ ముందు హాజరు పరచాలని చీఫ్ ప్రాసిక్యూటర్ ముహమ్మద్ తాజుల్ ఇస్లామ్ ధ్రువీకరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి, బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ అల్లర్లలో 230 మందికి పైగా మరణించారు. నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 5న షేక్ హసీనా అక్కడి ఆర్మీ అల్టిమేటంతో భారత్ పారిపోయి వచ్చారు. నిరసనల్లో మరణాలకు హసీనాతో పాటు ఆమె సహాయకులు కారణమని న్యాయవాదులు వాదించారు. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనాను విచారణకు తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.