విమానయానం అంటే జనాలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మనం ఎక్కే విమానం క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏకంగా ఒక్క నెలలోనే మొత్తం 9 మిడ్ ఎయిర్ ప్రమాదాలు జరిగాయి. ఆకాశంలో ఉండగానే సాంకేతిక లోపాలతో ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. జూలై 5 నుంచి జూలై 21 మధ్య ఈ తొమ్మిది ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలు ప్రయాణికుల రక్షణను ప్రశ్నిస్తున్నాయి. డొమెస్టిక్ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికే ఈ ప్రమాదాలపై, ప్రయాణికుల భద్రతపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) విచారణ జరుపుతోంది.
జూలై 21న సాంకేతిక లోపంతో ఎయిర్ ఇండియా దుబాయ్- కొచ్చిన్ విమానాన్ని ముంబైకి మళ్లించారు. విమానంలో ఎయిర్ ప్రెజర్ తగ్గడాన్ని గుర్తించి పైలెట్ విమానాన్ని అత్యవస ల్యాండింగ్ చేశారు. బోయింగ్ 787 ఫ్లైట్ నెంబర్ ఏఐ-934 విమానం ఈ ప్రమాదానికి గురైంది.
Read Also: Monkeypox: ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
జూలై 20న ఢిల్లీ నుంచ గౌహతి వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని సాంకేతిక కారణంగా జైపూర్ మళ్లించారు. ఏ 320నియో విమానం విండ్ షీల్డ్ గాలిలో ఉండగానే పగిలిపోయింది. జూలై 19న ఇదే గో ఫస్ట్ సంస్థకు చెందిన రెండు విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న గో ఎయిర్ ఏ320 వీటీడబ్ల్యూజీఏ విమానంలో ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తతెత్తడంతో ఢిల్లీకి మళ్లించారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న మరో గో ఎయిర్ ఏ 320 డబ్ల్యూజేజీ విమానంలో కూడా ఇంజన్ నెంబర్ 2లో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి శ్రీనగర్ విమానాశ్రయానికి మళ్లించారు.
జూలై 17న షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తతెల్తడంతో పాకిస్తాన్ కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. జూలై 16న కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానంలో మండుతున్న వాసన రావడంతో ఓమన్ రాజధాని మస్కట్ లో ల్యాండింగ్ చేశారు. జూలై15న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బహ్రెయిన్ – కొచ్చి విమానం కాక్ పిట్ లో పక్షి కనిపించడంతో.. కొచ్చిలో విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. జూలై 14న ఇండిగోకు చెందిన ఢిల్లీ- వడోదర విమానంలో వైబ్రేషన్స్ రావడంతో జైపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జూలై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఇండికేటర్ లైట్ పనిచేయకపోవడంతో కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.