Atiq Ahmed: గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ పోలీసుకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ప్రయాగ్‌రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.
ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకు వీరిద్దరి కస్టడీకి ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోర్టు ముందు దాఖలు చేసిన చార్జిషీట్ లో అతిక్ అహ్మద్ రికార్డెడ్ స్టేట్మెంట్ ను ప్రస్తావించారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో ప్రత్యక్ష సంబంధాలు ఉండటంతో తనకు ఆయుధాల కొరత లేదని, పాకిస్తాన్ నుంచి పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు పడేసేవారని, వాటిని స్థానికుల సహాయంతో సేకరించే వారమని, జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదుల నుంచి కూడా ఆయుధాలు లభిస్తాయని, మీరు నన్ను తీసుకెళ్తే ఇందుకు ఉపయోగించిన డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తిరిగి పొందేలా మీకు సహాయం చేస్తానని ఛార్జిషీట్ లో అతిక్ అహ్మద్ పేర్కొన్నాడు.
Read Also: Modi – Sunak : బ్రిటన్ ప్రధాని సునక్‌కి మోదీ ఫోన్.. ఆ అంశాలపైనే చర్చ
ఇదిలా ఉంటే అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను గురువారం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఎన్ కౌంటర్ లో హతం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడితో పాటు షార్ప్ షూటర్ గులాంలు ఇద్దరు యూపీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఝాన్సీ వద్ద ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ ను గతంలో ఓ సారి కిడ్నాప్ చేసింది అతిక్ అహ్మద్ గ్యాంగ్. అయితే ఈ కేసులో అతడికి ఇటీవల జీవితఖైదు పడింది. రాజుపాల్ హత్య కేసు విచారణ దగ్గర పడుతున్న సమయంలో అతడి కొడుకు అసద్ తో కలిసి కొంతమంది అతడిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూపీలో మాఫియాను మట్టిలో కలిపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నట్లుగానే ఈ కేసులో అసద్ తో పాటు ముగ్గురు నిందుతులు ఎన్ కౌంటర్లలో మరణించారు.