Ramdas Athawale: కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని నిధులు రావాలంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ బందు అథవాలే బుధవారం సూచించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. విజయన్ ఎన్డీయేలో చేరితే అది ఇక ‘‘విప్లవాత్మక’’ చర్య అవుతుందని, కేరళకు మరిన్ని నిధులు వస్తాయని ఆయన అన్నారు. ఆ నిధుల్ని కేరళ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చని, ప్రధాని మోడీ కేరళకు ఒక పెద్ద ప్యాకేజీ ఇస్తారని ఆయన అన్నారు.
Read Also: Gautam Gambhir: ‘నేను నా సొంత జట్టుతోనే పోటీ పడుతున్నా’.. వివాదంగా మారిన గౌతమ్ గంభీర్ పోస్ట్..
అథవాలే వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ తీవ్రంగా విమర్శిస్తూ, ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యాఖ్యలు, రాజ్యాంగ విరుద్ధమైనవిగా అభివర్ణించారు. గత ఐదేళ్లలో కేరళకు రావాల్సిన సుమారు రూ. 2 లక్షల కోట్లను కేంద్రం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు భారత సమాఖ్య వ్యవస్థపై దాడిగా అన్నారు. అన్ని రాజ్యాంగ సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్ క్రిందకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాల్లో ఒకటని ఆయన అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు నిరంకుశత్వానికి, నయా ఫాసిజం వైపు పయనాన్ని సూచిస్తున్నాయని అన్నారు.
కేంద్ర మంత్రి అథవాలే తన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విజయన్ ఎన్డీయేలో చేరితే వారు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం కావచ్చని అన్నారు. దీనిపై గోవిందన్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు అథవాలేకు కేరళపై ఉన్న అవగాహనారాహిత్యాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీపీఎం, సీపీఐ రెండు పార్టీలు కూడా ఎన్డీయేలో చేరాలని అథవాలే పిలుపునిచ్చారు. సోషలిస్ట్ నాయకులే ఎన్డీయేలో చేరగలిగినప్పుడు, కమ్యూనిస్టు నాయకులు ఎందుకు చేరకూడదని ప్రశ్నించారు.
