Assam Floods: ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ బ్రహ్మపుత్ర నదితో పాటు ఇతర నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా జిల్లాలో వరద భీభత్సం సృష్టిస్తోంది. బుధవారం అస్సాంలో పరిస్థితి మరింత దిగజారింది. 20 జిల్లాల్లో 1.20 లక్ష మంది వరదబారిన పడ్డారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాలు, పక్కన ఉన్న భూటాన్ దేశంలో కుండపోత వర్సాల కారణంగా అనేక నదులు నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగాయి. దీంతో లోతట్లు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.
Read Also: Karnataka: తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్‌లో కూతురికి పోస్టింగ్..
బజలి, బక్సా, బార్‌పేట, బిస్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూగఢ్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్‌పూర్, తముల్‌పూర్, ఉడల్‌గురి జిల్లాల్లోని 45 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 780 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బజలి, దర్రాంగ్, కమ్రూప్ (మెట్రో), కోక్రాఝర్ మరియు నల్బరీ జిల్లాల్లో కూడా పట్టణ వరదలు సంభవించాయి. నల్బరి జిల్లాలో 44707 మంది, బక్సాలో 26571 మంది, లఖింపూర్‌లో 25096 మంది, తముల్‌పూర్‌లో 15610 మంది, బార్‌పేట జిల్లాలో 3840 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా 1.07 లక్షల పెంపుడు జంతువులు, కోళ్లు దెబ్బతిన్నాయి.
జిల్లా యంత్రాంగం 14 సహాయక శిబిరాలు, 17 సహాయ పంపినీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 2091 మంది బక్సా, ధుబ్రి, కోక్రాఝర్, నల్బారి, తముల్పూర్ జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ దళాలు సహాయచర్యలను నిర్వహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1280 మందిని బుధవారం సురక్షితంగా తరలించారు. వరదల కారణంగా ఒక్క బుధవారమే 72 రోడ్లు, 7 వంతెనలు దెబ్బతిన్నాయి. బేకీ నది, పుతిమరి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.