దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు.. గత ఏడాది నవంబర్‌లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన ఆయన.. ఇప్పుడు దీదీ పార్టీకి బైబై చెప్పి చీపురు పట్టారు.. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హర్యానాలో తన పార్టీ విస్తరణకు ఇది దోహద పడుతుందని ఆప్ అంచనా వేస్తోంది.
Read Also: TS: హస్తిన నుంచి గవర్నర్ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?
ఇక, తన్వర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కేజ్రీవాల్ తన రాజకీయ అనుభవం ఖచ్చితంగా హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా ఆప్‌కి గొప్ప సహాయం చేస్తుందని అన్నారు. “ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబానికి స్వాగతం, అశోక్ జీ. విద్యార్థి రాజకీయాల నుండి పార్లమెంటు వరకు మీ రాజకీయ అనుభవం హర్యానాలో మరియు దేశవ్యాప్తంగా పార్టీ సంస్థకు ఎంతగానో సహాయపడుతుంది” అంటూ ట్వీట్ చేశారు ఆమ్‌ఆద్మీ చీఫ్.. కాగా, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడైన తన్వర్.. అంతకుముందు హర్యానాలోని సిర్సా నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఆయన హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ మరియు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్‌ఎస్‌యూఐ) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.