బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ వ్యాఖ్యలకు ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే వెస్ట్ బెంగాల్ లో హౌరాతో పాటు యూపీ ప్రయాగ్ రాజ్, జార్ఖండ్ రాంచీల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. రాంచీలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలో ఇద్దరు మరణించారు.
ఇదిలా ఉంటే శుక్రవారం ప్రార్థనల తరువాత జరిగిన హింసపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హింస జరగకూడదని.. అయితే నుపుర్ శర్మపై చర్యలు తీసుకోకపోవడంతోనే హింస చెలరేగిందని ఆయన అన్నారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రభుత్వాలే చూసుకోవాలని.. సుపుర్ శర్మపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఓవైసీ డిమాండ్ చేశారు. చాలా చోట్ల శాంతియుతంగానే నిరసనలు జరిగాయని.. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని..ఎవరూ హింసకు పాల్పడవద్దని.. నిన్న రాంచీలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని.. పోలీసుల చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఓవైసీ అన్నారు.
మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల అల్లర్లలో పాల్గొన్న వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవడంపై అసదుద్దీన్ స్పందించారు. బుల్డోజర్ యాక్షన్ ను విమర్శించారు. ఒకరి ఇంటిని ధ్వంసం చేయడానికి మీరు ఎవరని.. శిక్షను నిర్ణయించేది కోర్టని..మీరు ప్రధాన న్యాయమూర్తా.? కోర్టా.?, ప్రతీది మీరే నిర్ణయించబోతున్నట్లయితే, న్యాయమూర్త అవసరం ఏంటని ప్రశ్నించారు. నుపుర్ శర్మను ఇంకా అరెస్ట్ చేయలేదని.. ఆమె సస్పెన్షన్ నిర్ణయంతో విషయం సర్దుకుపోతుందని బీజేపీ ఆలోచిస్తే అది జరగదని.. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.