ఆర్మీ కొత్త రిక్రూట్మెంట్ ప్లాన్ ను వ్యతిరేఖిస్తూ చాలా మంది యువత దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఆర్మీ ఆశావహులు ట్రైన్లకు నిప్పు పెడుతున్నారు. కేంద్రం కూడా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలపై కేంద్రం కూడా కొన్ని సడలింపులను ఇస్తోంది.
ఇదిలా ఉంటే అగ్నిపథ్ నిరసనలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నిరసనల్లో విధ్వంసంపై మాట్లాడుతూ.. ఇప్పుడు ఎంతమంది నిరసనకారుల ఇళ్లను ధ్వం సం చేస్తారని ప్రశ్నించారు. గత నెలలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా యూపీలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న వ్యక్తుల ఇళ్లను యోగీ ప్రభుత్వం కూల్చేస్తోంది. అయితే తాజాగా అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొన్న వారి ఇళ్లను కూల్చివేస్తారా..? అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
మోదీ తప్పుడు నిర్ణయం వల్ల యువకులు వీధినపడ్డారని.. మీరు ఎవరి ఇంటిని కూల్చడం కూడా మాకు ఇష్టం లేదని అసద్ అన్నారు. నిరసనకారులు పిల్లల వంటివారు వారకి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఉత్తర్ ప్రదేశ్ వారణాసికి చెందిన ఓ పోలీస్ అధికారి అన్న మాటలపై కూడా ఆయన స్పందించారు. ‘‘ ముస్లింలు మీ పిల్లలు కాదా..?, మేము కూడా ఈ దేశపు పిల్లలమే, మీరు మాతో కూడా మాట్లాడాాలి’’ అని అసదుద్దీన్ అన్నారు.
ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ లో హింస చెలరేగింది. ప్రధాన నిందితుడైన జావేద్ మహ్మద్ ఇంటిని కూల్చివేత గురించి అసదుద్దీన్ ప్రస్తావించారు. జే ఎన్ యూ విద్యార్థి నాయకురాలు ఆఫ్రిన్ ఫాతిమా తండ్రి జావెేద్ మహ్మద్. అయితే ఆఫ్రీన్ ఫాతిమా ఇంటిని ఎందుకు కూల్చివేశారని.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం చట్టం నిందితుడిని శిక్షిస్తుంది కానీ.. అతని భార్య, కుమార్తెను కాదు అని ఆయన అన్నారు. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ రానున్న కాలంలో పెద్ద నాయకురాలు అవుతుందని.. ఢిల్లీలో సీఎం అభ్యర్థిగా నిలబెడుతారని బీజేపీని విమర్శించారు. ముస్లింలను ఎంత తిడితే మీకు అంత గొప్ప పదవులు వస్తాయని అసద్ అన్నారు.