మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పలు చోట్ల పట్టాలు మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీని వల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదర్, సియోన్ ప్రాంతాలతో పాటు మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా పొవై సరస్సు పొంగిపొర్లుతోంది. మంగళవారం భారీ వర్షాల మధ్య ముంబైలోని ఘట్కోపర్లోని పంచశీల్ నగర్లో కొండచరియలు విరిగిపడి ఇల్లు నేలమట్టమైంది.
ముంబయిలో దాదాపు 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం వరకు ముంబయి సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే శివారు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి.
మహారాష్ట్రలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటిందని, అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే స్వల్పంగా దిగువన ఉంది. అలాగే మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, పూణే, బీడ్, లాతూర్, జాల్నా, పర్భానీ తదితర ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రత్నగిరి, రాయగఢ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు జగబూడి, కాజ్లీ నదుల నీరు హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్నందున జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ..: ఆ రాష్ట్రంలో కూడా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌లోని కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతిలో ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. వరదల కారణంగా జిల్లాలోని మలానా, మణికరణ్ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతిచెందారు. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.