Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలపై కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్ వారి ప్రశ్నలు ఆడగటం మానేయండి.. గుజరాత్ తో కాంగ్రెస్ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోరని ఆయన అన్నారు.
Read Also: Mrunal Thakur: అతడితో పిల్లలను కనాలని ఉందంటున్న సీత..
ఢిల్లీ తరువాత ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి.. అధికారాన్ని చేపట్టింది. ఢిల్లీ వెలుపల తొలిసారిగా పంజాబ్ రాష్ట్రంలో పాగా వేసింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ సారి ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది.
గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదని.. బీజేపీకి ఆప్ మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాలన అక్కర లేదని.. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
2017 ఎన్నికల్లో గుజరాత్ లోకి అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. అయితే పంజాబ్ రాష్ట్రం ఇచ్చిన ఊపుతో గుజరాత్ లో పాగా వేయాలని చూస్తోంది. ఆ ఎన్నికల్లో 182 సీట్లలో 99 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. 77 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. 2024 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గుజరాత్, హిమాచల్ ఎన్నికలు కీలకంగా మారాయి.