Delhi Rains: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 1958 జూలై 21న ఆల్ టైం హై వర్షపాతం 266.2 మి.మీ రికార్డు అయింది. ఆ తరువాత 2003 జూలై 10న 133.4 మి.మీ వర్షం కురిసింది.
Read Also: West Bengal: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రక్తపాతం.. 20కి చేరిన మరణాల సంఖ్య..
రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీ జలమయం అయింది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రోడ్లపైకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శనివారం ఏకంగా 126 మి.మీ వర్షం నమోదైంది. రుతుపవన సీజన్ మొత్తం వర్షపాతంలో 15 శాతం వర్షం కేవలం 12 గంటల్లోనే కురిసింది.
ఇదిలా ఉంటే వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులందరికీ ఆదివారం సెలవును రద్దు చేశారు. అందురూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈరోజు వర్ష ప్రభావ ప్రాంతాల్లో మంత్రులు, మేయర్ పర్యటించనున్నారు. ఆదివారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వానల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది.