దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అంబేద్కర్ వివాదం నడుస్తోంది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ బదులు.. భగవంతుని పేరు తలుచుకుంటే స్వర్గంలోనైనా పుణ్యం దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష పార్టీలన్నీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాయి. ఇలాంటి వివాదం నేపథ్యంలో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు దళితుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు.
దళిత విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా వర్తిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. అమిత్ షా.. అంబేద్కర్‌ను అగౌరవ పరిచినందుకు.. తాము దళితులను గౌరవించేందుకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. నిధుల కొరత కారణంగా దళిత వర్గానికి చెందిన ఏ వ్యక్తి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదని తెలిపారు. ఇందుకోసమే అంబేద్కర్ స్కాలర్‌షిప్ పథకం తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే దళిత వర్గానికి చెందిన ఏ విద్యార్థి అయినా, విద్యార్థుల ప్రవేశం తర్వాత వారి ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దళిత సమాజానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. డాక్టర్ అంబేద్కర్ స్కాలర్‌షిప్‌ను ప్రకటించడం ద్వారా.. అంబేద్కర్‌ను అగౌరవపరిచిన బీజేపీకి మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమాధానం ఇస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. అంతేకాకుండా కేజ్రీవాల్.. ఆయా వర్గాలకు వరాలు కురిపిస్తున్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇలా ఆయా వర్గాలను ఆకట్టుకుంటూ కేజ్రీవాల్ వరాలు కురిపిస్తున్నారు.