Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేరని, చైనా తీరును ఖండించింది భారత్. చాలా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని దక్షిణ టిబెట్ పేరుతో పలుస్తోంది చైనా. ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే పేర్లను మార్చింది.
Read Also: India Growth: ఈ ఏడాది భారత్ ఆర్థిక వృద్ధి 6.3 శాతం.. అంచనాలను తగ్గించిన వరల్డ్ బ్యాంక్..
ఇదిలా ఉంటే ఈ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని స్పష్టం చేసింది. ఇలా పేర్లను మార్చడం వంటి ఏకపక్ష ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఆదివారం రోజు చైనా ప్రభుత్వం అరుణాచల్ లోని 11 ప్రదేశాలకు చైనీస్, టిబెటెన్ భాషల్లో పేర్లు పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను మేం గతంలో చూశామని, చైనా ఇలా చేయడం మొదటిసారి కాదని, దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.
2017లో ఇలాగే అరుణాచల్ లోని 6 ప్రాంతాలకు, 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చింది చైనా. టిబెట్ ను కబ్జా చేసుకున్న తర్వాత ఇటు లఢక్ ప్రాంతంలో అటు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో భారత్ తో నిత్యం ఉద్రిక్తతలను పెంచుతోంది చైనా. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో కూడా మరోసారి భారత సరిహద్దుల్లోకి చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ వచ్చింది. ఆ సమయంలో భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి.