Madras High Court: నిందితులు పదే పదే కస్టడీలో జారిపడి గాయాలపాలవుతున్నారనే పోలీసులు వాదనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు తీరును ప్రశ్నించింది. తన కుమారుడు జాకీర్ హుస్సేన్‌కు సరైన వైద్య చికిత్స కోరుతూ కాంచీపురానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, వి లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం విచారించింది.
Read Also: CM Chandrababu: స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యం.. డ్వాక్రా మహిళలకు బాధ్యత..
అరెస్ట్ చేయబడి జైలు శిక్ష అనుభవిస్తున్న జకీర్ హుస్సేన్ కస్టడీలో ఉన్నప్పుడు అతడి ఎడమ కాలు, కుడి చేయిలో ఫ్రాక్చర్లు కనిపించాయి. జాకీర్‌కి గాయాలు ఎలా అయ్యాయని హైకోర్టు ప్రశ్నించగా, ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ, అతను టాయిలెట్‌లో జారి పడిపోయాడని చెప్పారు. జకీర్ ఇప్పటికే చికిత్స తీసుకున్నాడని, అదుపరి వైద్యం అవసరం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపాడు.
దీనిపై ఆగ్రహించిన కోర్టు, ‘‘పోలీస్ స్టేషన్ టాయిలెట్లలో నిందితులు మాత్రమే ఎందుకు జారి పడుతున్నారు..?’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇలాంటి సంఘటనలను అంతం చేయాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. ఇదే విధంగా కొనసాగితే బాధ్యతాయుతమైన అధికారులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జకీర్‌కు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్స అందేలా చూడాలని కోర్టు అధికారులను ఆదేశించి, కేసును ముగించింది.