NTV Telugu Site icon

Annamalai: లోక్‌సభ బరిలో ‘‘సింగం అన్న’’.. తమిళనాట బీజేపీ తురుపుముక్క ‘‘అన్నామలై’’

K Annamalai

K Annamalai

Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలో నిలిపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

2021 చిన్న వయసులోనే బీజేపీ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీలో చేరిన ఏడాదికే ఆయనకు అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది. తమిళనాడులో మాస్ లీడర్ల ఫాలోయింగ్ ఎక్కువ. ప్రస్తుతం ఈ చరిష్మా తెచ్చుకునేందుకు అన్నామలై ప్రయత్నిస్తున్నారు. స్ట్రిక్ట్ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్న అన్నామలై రియల్ ‘‘సింగం’’గా, ‘‘సింగం అన్నా’’గా ట్యాగ్ సంపాదించుకున్నారు.

వ్యవసాయ కుటుంబం నుంచి:

కరూర్ జిల్లాలోని తొట్టంపుట్టిలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అన్నామలై గౌండర్ కమ్యూనిటీకి చెందిన వారు. తమిళనాడులోని కొంగు ప్రాంతంలో ఈ కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువ. మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిని అన్నామలై 2011లో పోలీస్ ఫోర్స్‌లో చేరారు. కర్ణాటక క్యాడెర్ ఐపీఎస్ అయిన అన్నామలై, ఆ రాష్ట్రంలోని గుట్కా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. అయితే, 8 ఏళ్ల కెరీర్ తర్వాత 2019లో రాజీనామా చేశారు. ఆ సమయంలో అతను బెంగళూర్ డిప్యూటీ కమిషనర్(సౌత్)గా ఉంటూ పదవికి రాజీనామా చేశారు.

Read Also: Himalayas: 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు.. ఆసియా ప్రజలపై తీవ్ర ప్రభావం..

టార్గెట్ డీఎంకే, బీజేసీ సపోర్ట్:

తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అధికార డీఎంకే పార్టీ అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. డీఎంకే టాప్ లీడర్ల అవినీతి గురించి ‘డీఎంకే ఫైల్స్’ ఆడియో టేపులను విడుదల చేసి సంచలనం సృష్టించారు. సెంథిల్ బాలాజీ, కె పొన్ముడి, ఎస్ జగత్రక్షకన్ మరియు ఇవి వేలు వంటి అనేక మంది మంత్రులు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు.

గతేడాది ఏఐడీఎంకే పార్టీతో తెగదెంపులు చేసుకున్న సమయంలో కూడా బీజేపీ అన్నామలైకి మద్దతు తెలిపింది. అన్నామలై 2024 లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తం కవరయ్యేలా జూలై 8, 2023న తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలను కవర్ చేస్తూ “ఎన్ మన్, ఎన్ మక్కల్” పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు జనాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

ఈ వారం పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి తిరుప్పూర్ సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఏకంగా ఈ సభకు మూడు నుంచి నాలుగు లక్షల మంది హాజరయ్యారు. దీనిని బట్టి చూస్తే ద్రవిడ రాజకీయాల్లో అన్నామలై ఎదుగుదల తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 7 నుంచి 15 శాతం మధ్య ఉంటుందని చెప్పారు. బీజేపీకి తమిళనాడులో బలమైన పునాది ఏర్పాటు చేసిన ఘనత అన్నామలైదే అని ఆయన అన్నారు.

Show comments