Himalayas: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వాతావరణ మార్పులను ప్రేరేపిస్తున్నాయి. ధృవాల వద్ద మంచు కరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే శతాబ్ధంలో భూమి విపరీత వైపరీత్యాలను ఎదుర్కొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంటార్కిటికాలో పెద్ద మంచు ఫలకం క్రమంగా కరుగుతోంది. ఇదిలా ఉంటే, స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. 2100 నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని, ఇది ఆసియాలో బిలియన్ల ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో వేగవంతంగా హిమానీనదాలు 65 శాతం రేటుతో కరుగుతున్నాయని, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. 2013 నుండి 2022 వరకు భారతదేశం యొక్క ప్రకృతి వైపరీత్యాలలో 44 శాతం భారాన్ని ఈ హిమాలయ ప్రాంతాలే భరించినట్లు నివేదిక వెల్లడించింది. భయంకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం, క్లైడ్ బరస్ట్ వంటివి హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న తీవ్రతను సూచిస్తున్నాయి.
Read Also: Director Krish: నేను ఎక్కడికి పారిపోలేదు.. ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు
స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్విరాన్మెంట్‌లో పర్యావరణ వనరుల విభాగం చీఫ్ కిరణ్ పాండే పరిస్థితి తీవ్రతను నొక్కిచెప్పారు. ఈ విపత్తులు తరుచుగా సంభవిస్తున్నాయని, మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాలకు దారి తీయొచ్చని హెచ్చరించారు. ఈ హిమానీనదాల నుంచి వచ్చే నీటిపై ఆధారపడుతున్న ఆసియాలోని రెండు బిలియన్ల ప్రజల జీవితాలకు ముప్పు ఉందని చెప్పారు. క్లౌడ్ బరస్ట్‌ల ద్వారా కొత్త సరస్సుల ఆవిర్భావం ప్రమాదాలను మరింతగా పెంచుతుందని, ఈ సరస్సులు పొంగిపొర్లినప్పుడల్లా వరదల వస్తాయని చెప్పారు.
ఇక హిమాలయాల్లోని వృక్ష సంపదలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. హిమాలయ వ్యవసాయంలో 90 శాతం వర్షపాతంపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంతంలో జీవనోపాధి స్థిరత్వం ప్రమాదంలో పడుతుంది. 40 శాతం మంచును హిమాలయాలు ఇప్పటికే కోల్పోగా.. ఇదే కొనసాగితే.. ఈ శతాబ్ధ చివరి నాటికి 75 శాతం వరకు మంచు కనుమరుగయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.