Amit Shah: ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థను ఆక్రమిస్తోందని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించిన ఒక రోజు తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ఈ రోజు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తాను కూడా ఆ సంస్థ అనుచరులేనని అన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఈ రోజు(బుధవారం) అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య సవాళ్లు పర్వం నడిచింది. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ లేవనెత్తగా, అమిత్ షా తీవ్రంగా బదులిచ్చారు.
ఓట్ చోరీ అంశంపై తనతో చర్చకు సిద్ధమా? అని రాహుల్ గాంధీ, అమిత్ షాకు సవాల్ విసిరారు. తాను ఎప్పుడు మాట్లాడాలో తానే నిర్ణయిస్తానని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దీని తర్వాత ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై అమిత్ షా మాట్లాడుతూ.. వారు 200 సార్లు బహిష్కరించవచ్చు. ఈ దేశంలో ఒక్క చొరబాటుదారుడిని కూడా ఓటు వేయడానికి అనుమతించము అని అన్నారు. సర్దార్ పటేల్ ప్రధాని కావాల్సింది, ఓట్ చోరీ ద్వారా నెహ్రూ అయ్యారని షా అన్నారు. సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు వస్తే, నెహ్రూకు 2 ఓట్లు వచ్చాయని కానీ, నెహ్రూనే ప్రధాని అయ్యారని అన్నారు.