Amit Shah: రిజర్వేషన్లపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. కొందరు కావాలనే జనాల్లో భయాందోళనలు రెకెత్తించి, బీజేపీని అడ్డుకునేలా చేసేందుకు ఈ వీడియోలను వైరల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు, కార్యకర్తలు వీటిని విస్తృతంగా షేర్ చేశారు. ఈ కేసులో అస్సాంకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నిజానికి అమిత్ షా రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేయమని వ్యాఖ్యానించిన వీడియోను మార్పింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.
Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
ఇదిలా ఉంటే, తాజాగా అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగానికి ఎప్పటికీ హాని చేయదని, ఓటర్లలో భయాందోళనలు పెంచేందుకు ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. అస్సాంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘మనకు ఇప్పటికే పూర్తి మెజారిటీ ఉందని, ప్రతిపక్షాలకు సంపూర్ణ మెజారిటీ వచ్చిన అలవాటు లేదు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేయడానికి సంపూర్ణ మెజారిటీని ఉపయోగించాము. మోడీని ప్రధానిని చేయడానికి, దేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి 400 సీట్లు అవసరం’’ అని షా అన్నారు. ఎవరూ కూడా రిజర్వేషన్లను అంతం చేయలేరు, రాజ్యాంగానికి హాని చేయలేరని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వంలో తీవ్రవాదం వెన్నువిరిచామని అన్నారు. ప్రతిపక్షాలు పాకిస్తాన్ టెర్రరిజంపై పెదవి విప్పడం లేదని అన్నారు. రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చెప్పారు.