Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో పాకిస్తాన్ ప్రతీ రోజూ దాడులు చేసేదని, ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన షా, ఉరి, పుల్వామా, పహల్గామ్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ ప్రతీరోజూ దాడులు చేస్తున్నా, ఓటు బ్యాంకు కోసం సోనియా, మన్మోహన్, లలూ ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ‘ఓటరు అధికార్ యాత్ర’పై కూడా అమిత్ షా విమర్శలు చేశారు. రాహుల్ యాత్ర రాష్ట్రంలోని చొరబాటుదారుల్ని రక్షించడానికి అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం బీహార్‌లోని చొరబాటుదారుల్ని ఏరిపారేస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిందని, 2027 నాటికి భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని అన్నారు. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
