Amit Shah: బుధవారం పార్లమెంట్‌లో ‘‘ఓట్ చోరీ’’ అంశంపై వాడీవేడీ చర్చ నడిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓట్ చోరీ అంశంపై నాతో సభలో చర్చకు సిద్ధమా..? నాతో మాట్లాడేందుకు అమిత్ షా భయపడుతున్నారని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. నేను ఏం మాట్లాడాలో నేనే నిర్ణయించుకుంటానని, మీరు కాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, నిన్న సభలో అమిత్ షా 102 డిగ్రీల జ్వరంతో ఉణ్నారని, సమావేశానికి కొద్దిసేపటి ముందు వైద్యులు పరిశీలించి, జ్వరం తగ్గడానికి మందులు ఇచ్చారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Read Also: Suryakumar Yadav: సూరీడికి ఏమైంది?.. 47, 39 పరుగులు తప్ప మెరుపుల్లేవు!
జ్వరంలో ఉన్నా కూడా ప్రతిపక్షాలకు ముఖ్యంగా, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటన్నర ప్రసంగంలో ఓట్ల చోరీ, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై వస్తున్న ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. షా నిన్న చేసిన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రశంసించారు.
అమిత్ షా తన ప్రసంగంలో.. కాంగ్రెస్ గెలిచినప్పుడు ఎన్నికల సంఘం సరిగా పనిచేస్తుందని, ఓడిపోయినప్పుడు మాత్రం ఓటర్ల జాబితాలో సమస్యల ఉన్నాయని చెబుతారని, ఇది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే మూడు సార్లు ఓట్ చోరీ జరిగిందని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ప్రధాని అభ్యర్థిగా సర్దార్ పటేల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినా, జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యారని, ఇందిరాగాంధీ హాయాంలో ఆమె రాయ్‌బరేలీ నుంచి గెలుపొందడం ఓట్ చోరీనే అని, అలహాబాద్ హైకోర్టు కూడా తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మూడోసారి సోనియాగాంధీ భారత పౌరసత్వం పొందకముందే, ఓటేశారని, దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోందని అన్నారు.