ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు..
పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే ఆపాలని ఆదేశించారు. నీకు ఎంత ధైర్యం… ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే నమ్మవా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే వీడియో కాల్ చేయమంటావా అంటూ.. ఫోన్ లోనే వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో.. ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని.. చట్టానికి కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇసక, మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు నేను ఎప్పటికి వ్యతిరేకమే అని ఆయన అన్నారు.