Ajit Pawar: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి దారుణమైన ఫలితాలు వచ్చాయి. బీజేపీ+శివసేన(షిండే)+ఎన్సీపీ(అజిత్ పవార్) కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ మూడు పార్టీలు కూడా అనుకున్నంత మేరకు సీట్లను సాధించలేదు. బీజేపీ 09, శివసేన 07, ఎన్సీపీ 01 సీట్లను మాత్రమే సాధించింది. మరోవైపు కాంగ్రెస్ 13, శివసేన(యూబీటీ) 09, ఎన్సీపీ(శరద్ పవార్) 08 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఫలితాలపై ఆయా పార్టీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. ఇప్పటికే బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని, ఓటమికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు.
Read Also: AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై కారణం.. లేకుంటే 35 సీట్లు గెలిచేవాళ్లం..
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా దారుణ ఫలితాలను చవి చూసింది. చివరకు బారామతిలో భార్య సునేత్రా పవార్‌ని కూడా గెలిపించుకోలేకపోయాడు. 05 స్థానాల్లో పోటీ చేసి ఒకే స్థానంలో గెలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, ఇతర నేతలు హాజరయ్యారు.
అయితే, ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ విదేశాల్లో ఉండగా.. మిగిలిన వారు తాము హాజరుకాకపోవడానికి అనారోగ్య సమస్యలు కారణమని చెబుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు అజిత్ పవార్ వర్గంలోని 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ వర్గంలో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న వేళ ఈ పరిణామం సంభవించింది.