NTV Telugu Site icon

Maharashtra: మాకు 80-90 సీట్లు కావాల్సిందే.. బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పట్టు..

Ajit Pawar

Ajit Pawar

Maharashtra: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. 288 స్థానాలు ఉన్న మహా అసెంబ్లీలో బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) పార్టీలు ‘మహాయుతి’ పేరుతో కూటమిగా పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు సీట్ల షేరింగ్‌పై చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సందర్భంగా ఎన్సీపీ వచ్చే ఎన్నికల్లో 80-90 సీట్లు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన విధంగా కాకుండా, వీలైనంత తొందరగా సీట్ల పంపిణీని ఖరారు చేయాలని అజిత్ పవార్ కోరారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏక్‌నాథ్ షిండే శివసేన 100 స్థానాల్లో, బీజేపీ 160-170 సీట్లలో పోటీ చేయాలని చూస్తున్నాయి.

Read Also: Paris: ఆస్ట్రేలియా మహిళపై గ్యాంగ్ రేప్.. ఒలింపిక్స్‌కి ముందు ఘటన..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర్ మహారాష్ట్ర(ఖండేష్) ప్రాంతంలో కాంగ్రెస్‌పై 20 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ భావిస్తున్నారు. మైనారిటీ వర్గం అధికంగా ఉండే ముంబైలోని 4-5 స్థానాల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అజిత్ పవార్ ఆసక్తి కనబరుస్తున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్సీపీ నుంచి పోటీకి దింపేందుకు అజిత్ పవార్ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సీట్ల పంపకంపై చర్చలు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అధిష్టానాన్ని కలిసేందుకు ఈ రోజు ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలు(48) ఉన్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి దారుణంగా విఫలమైంది. కేవలం 17 చోట్లనే ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇందులో 09 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇక కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి మహావికాస్ అఘాడీ ఏకంగా 30 స్థానాల్ని కైవసం చేసుకుంది.