Starlink: ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో రిలయన్స్ గ్రూప్‌కి చెంది జియో జట్టు కట్టింది. ఇప్పటికే, ఎయిర్‌టెల్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలోని రెండు టెలికాం దిగ్గజాలు స్పేస్ ఎక్స్‌తో భాగస్వామ్యం కాబోతోన్నాయి. దేశంలో మరింత వేగంగా ఇంటర్నెట్‌ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల్ని ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యాయి.
ఎయిర్ టెల్ రిటైల్ స్టోర్ల ద్వారా స్టార్‌లింక్ పరికరాలను అందించడంతో పాటు దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందించడంతో పాటు పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను అనుసంధానించే అవకాశాలను అన్వేషిస్తున్నామని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, జియో..‘‘అందరికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందేలా చూసేందుకు ఈ భాగస్వామ్యం ఒక కీలక అడుగు. జియో బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థతో స్టార్‌లింక్‌ను అనుసంధానించడం ద్వారా మా పరిధిని మరింత విస్తరించనున్నాం. ఈ ఒప్పందం ఏఐ ఆధారిత యుగంలో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ విశ్వసనీయతను పెంచనుంది’’ అని చెప్పింది.
స్టార్‌లింక్ భారత్‌కి ఎలా సహాయపడుతుంది..?
2021 నుంచి భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి స్టార్‌లింక్ ప్రయత్నిస్తూనే ఉంది. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడం, మొబైల్ టవర్లు నిర్మించడం వల్ల కలిగే అధిక ఖర్చు, లాజిస్టిక్ సవాళ్ల కారణంగా దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ లేదు. 100కోట్లకు మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్న భారత్ వంటి దేశంలో ఈ సవాళ్లు అధిగమించడానికి స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ఉపయోగపడనున్నాయి. కొండలు, గుట్టలు, అడవులు ఉన్న అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా దాదాపుగా 25-220 Mbps హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ప్రస్తుతం దేశంలోని 6,44,131 గ్రామాలలో 6,15,836 గ్రామాలకు 4G మొబైల్ కనెక్టివిటీ ఉంది.
భారతదేశంలో స్టార్‌లింక్ ధర ఎంత ఉండొచ్చు..?
ప్రపంచంలోనే ఇంటర్నెట్ డేటా అత్యంత చౌకగా లభించే దేశాల్లో భారత్ ఉంది. అయితే, స్టార్‌లింక్ ధరలు ఎంటాయనేదానిపై స్పష్టత లేదు. అయితే, 2022లో అప్పటి స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ మాట్లాడుతూ, మొదటి సంవత్సరానికి రూ.1,58,000 ఖర్చవుతుందని అన్నారు. రెండో ఏడాది దీని ఖర్చు రూ.1,15,000 ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం భూటాన్ తప్ప భారత పొరుగు దేశాల్లో ఎవరికి స్టార్‌లింక్ అందుబాటులో లేదు.
భూటాన్‌లో, స్టార్‌లింక్ యొక్క ‘రెసిడెన్షియల్ లైట్ ప్లాన్’ నెలకు దాదాపు రూ. 3,000 ఖర్చవుతుంది. 23 Mbps నుండి 100 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది. ‘స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్’ నెలకు దాదాపు రూ.4,200 ఖర్చవుతుంది, 25 Mbps నుండి 110 Mbps వరకు వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. ప్రస్తుతం స్టార్‌లింక్ 100కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. కెన్యాలో దీని ధర నెలకు 10 డాలర్లుగా ఉంటే, యూఎస్‌లో 120 డాలర్లుగా ఉంది.
భారతదేశంలో ఇంటర్నెట్ ఇటీవల కాలంలో వేగంగా పెరిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశంలో 2014లో దాదాపుగా 25 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు ఉంటే, 2024 నాటికి 96 కోట్లకు చేరింది. ఇది ఏకంగా 285.53 శాతం వృద్ధి. మరోవైపు, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు 1452 శాతం పెరిగాయి. 2014లో వైర్ లెస్ డేటా సబ్‌స్క్రైబర్ సగటున నెలవారీ డేటా వినియోగం 61.66 MBగా ఉంటే, 2024లో ఏకంగా 21.30 GBకి పెరిగింది. ఇది 353 రెట్లు పెరిగింది. ప్రస్తుతం, 779 జిల్లాల్లో 4.62 లక్షలకు పైగా BTS (బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్) మోహరించడంతో, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G సేవలను దేశం చూస్తోంది.